నిరుద్యోగులను మోసం చేసిన నిందితులు అరెస్ట్
నిరుద్యోగుల నుంచి రూ.10లక్షల వరకు వసూల్ చేసిన నిందితులు

నల్గొండ జిల్లా తిప్పర్తిలో కేసులు నమోదు
కోర్టులో ఉద్యోగాల పేరిట మోసం
నిరుద్యోగుల నుంచి రూ.10లక్షల వరకు వసూల్ చేసిన నిందితులు
సాయిసూర్య-తెలంగాణ డెస్క్:ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం సంపాదించడం అంటే..ఎంతో మంది ఉద్యోగులకు ఓ కల. చిరకాల కోరిక...కోసం ఎంతో కష్టపడుతుంటారు. కొన్ని సార్లు కొంత మంది కష్టపడుతూనే మోసపోతున్న కేసులు ఎన్నో ఉన్నాయి.
ఈ కోవలోనే నల్లగొండ జిల్లాలో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 31 మంది నిరుద్యోగ మహిళలను మోసం చేశారు. లక్షల డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి...నట్టేట ముంచారు.
నల్గొండలో చోటు చేసుకున్న ఈ ఘరానా మోసంలో మొత్తం 31 మంది మహిళల నుంచి రూ.10.32 లక్షలు వసూలు చేశారు. నల్గొండ పట్టణానికి చెందిన గాజుల జ్యోతి రాణి, న్యాయవాది, హైదరాబాద్ రోడ్ పద్మ నగర్ కాలనీకి చెందిన అడ్వకేట్ క్లర్క్ మొహమ్మద్ నసీర్‌ను అరెస్ట్ చేశామని నల్గొండ డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు. వారిని రిమాండ్ కు తరలించినట్టు వెల్లడించారు.
31 మంది నిరుద్యోగులకు నల్గొండ జిల్లా కోర్టులో స్వీపర్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. కోర్టు పరిసరాలను కేంద్రంగా చేసుకుని నిరుద్యోగులకు ఎర వేశారు. ఈ విషయం తెలుసుకున్న నల్లగొండ ఎస్పి శరత్ చంద్ర పవార్ చర్యలు తీసుకున్నారు.
తిప్పర్తి మండలం ఇండ్లూరుకు చెందిన ఏపురి హెప్సిబా అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 7 న తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పక్క ప్లాన్ తో నిందితులను పట్టుకున్నారు. నిందితులు నిరుద్యోగుల నుంచి 50,000/- చొప్పున, మరికొంత మంది నుంచి 20 నుంచి 30 వేల రూపాయలు చొప్పున వసూలు చేసినట్లు తేలింది. వీరిపై తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో 4 నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో 3 కేసులు నమోదయ్యాయి. వీరి నుంచి రూ.10,000 నగదు, రెండు సెల్ ఫోన్లు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ...ఉద్యోగం ఇప్పిస్తామనే మాయమాటలు నమ్మవద్దు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడూ నోటిఫికేషన్‌ల ద్వారా, పరీక్షల ద్వారా మాత్రమే భర్తీ అవుతాయని తెలిపారు.
About The Author
