narendra modi:కాల్పుల విరమణతో మోడీ ఇమేజ్ పెరిగిందా..తగ్గిందా!

పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రధాని మోడీ రాజకీయ ఇమేజ్‌ను ప్రభావితం చేసిందా అన్న చర్చ దేశ ప్రజల మధ్య తీవ్రంగా సాగుతోంది. ఆపరేషన్ సిందూర్, బాలాకోట్ దాడులతో ఉగ్రవాద వ్యతిరేక యోధుడుగా ఇమేజ్‌ని సొంతం చేసుకున్న మోడీ ఇప్పుడు ఎందుకిలా చేశారు అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ ఎంతగానో బెదిరిపోయింది. అది అనివార్యంగా చర్చలకు వచ్చేలా చేసింది. అయితే, యుద్ధ క్షేత్రంలో దాయది పై పూర్తిగా పై చేయి సాధించిన భారత్.. మరోమారు అది వికృత చేష్టలకు పాల్పడకుండా ఎలాంటి ఒప్పందాలు లేకుండానే కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకుంది అనేది ప్రశ్న. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ని భయపెట్టగలిగాము..కానీ అది ఎంత కాలం అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది.
ఒకవైపు, కాల్పుల విరమణ.. మరోవైపు పాకిస్తాన్ ఎప్పటిలాగే ఎల్‌ఓసీ వద్ద తన కుక్కబుద్ధి ప్రదర్శన. అది మళ్లీ భారత్ వైపు కన్నెత్తి చూడకుండా చేసేందుకు అందివచ్చిన అవకాశాన్ని భారత్ ఎందుకు వదులుకుంది? ఏ ఒత్తిడులకు తలొగ్గి కాల్పుల విరమణకు ఒప్పుకుందో ప్రధాని మోడీ ప్రజలకు చెప్పాలంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం రాజకీయ రాజీగా విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే ఈ నిర్ణయం మోడీ దీర్ఘకాల వ్యూహాత్మక దృష్టిని ప్రతిబింబిస్తుందని అధికార వర్గాలు అంటున్నాయి. కానీ దీనిని అర్థం చేసుకునే స్థితిలో ఇప్పుడు భారత ప్రజలు ఉన్నారా? విమర్శకులు కూడా ఈ నిర్ణయాన్ని మోడీ స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్‌కు ఎదురుదెబ్బగా చూస్తున్నారు. పాకిస్తాన్ బలహీనత, అంతర్జాతీయ ఒత్తిడి ఈ ఒప్పందానికి దారితీశాయనేది బహిరంగ రహస్యం. ఏదేమైనా, ఆపరేషన్ సిందూర్ తో ప్రధాని మోడీ ఇమేజ్ ఒక్కసారిగా పైకెళ్లి, ఆ తర్వాత ఆయన భక్తులు కూడా ఉస్సూరుమనే పరిస్థితి ఏర్పడిందనేది కళ్లముందు కనిపిస్తున్న నిజం. వారే కాదు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, మేధావులు, రక్షణ రంగ నిపుణులు, కళాకారులు, జర్నలిస్టులు ఇలా ప్రతీ ఒక్కరూ తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో ఆత్మరక్షణలో పడిన ప్రధాని మోడీ డ్యామేజీ కంట్రోల్‌కు దిగినట్టు కనిపిస్తోంది. సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించడం, ఆ మరుసటి రోజే పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించడం ఇందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘కాల్పుల విరమణ’పై ఆగ్రహంతో ఉన్న వారిని తన ప్రసంగంతో దారికి తెచ్చుకోవాలని ప్రధాని మోడీ ఎంతో ప్రయత్నించారు. భావోద్వేగపూరిత సంభాషణలతో స్పీచ్‌ను కొనసాగించారు. అయితే, ప్రజలు, మేధావులు మోడీ నోటివెంట వినాలనుకొన్నది సెంటిమెంట్ స్పీచ్ కాదు. ‘కాల్పుల విరమణ’ నిర్ణయాన్ని ఎందుకు, ఏ పరిస్థితుల్లో అంగీకరించాల్సి వచ్చిందన్న దానిపైనే అందరి ఆసక్తి నెలకొంది. అయితే, తన ప్రసంగంలో ఆ విషయాన్నే మోడీ దాటవేశారు. ‘ట్రంప్ వాణిజ్య బెదిరింపుల వ్యాఖ్యల’పై కూడా ఆయన స్పందించలేదు. దీంతో మోడీ వైఖరిపై అందరూ మండిపడ్డారు. ప్రసంగం నిస్తేజంగా ఓ ప్రహసనంలా సాగిందని ధ్వజమెత్తారు. జాతినుద్దేశించి మాట్లాడటం పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యామ్నాయం కాదని, బాధ్యతల నుంచి ప్రధాని తప్పించుకోలేరని ప్రముఖ జర్నలిస్ట్ రాజు పార్లేకర్ వంటి వారు బహిరంగంగానే విమర్శించారు. ‘ట్రంప్ వాణిజ్య వ్యాఖ్యల’పై తన ప్రసంగంలో ఒక్కమాట కూడా ప్రధాని ఎత్తలేదు. అయితే, ప్రసంగం అయ్యాక.. అమెరికాతో చర్చల్లో వాణిజ్యం ప్రస్తావనే రాలేదంటూ కేంద్ర ప్రభుత్వ
వర్గాలు ఓ మొక్కుబడి ప్రకటనను విడుదల చేశాయి. దీంతో నెటిజన్లు మరింతగా మండిపడ్డారు. మొత్తంగా తన ప్రసంగం కూడా ప్రభావం చూపలేదని గ్రహించిన ప్రధాని మోడీ మంగళవారం పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించి జవాన్లతో ముచ్చటించారు. పనిలోపనిగా సైనికుల్లో ధైర్యాన్ని నింపేలా ప్రసంగించారు. భారత ఆడపడుచుల సిందూరం తుడిచిన వారి నట్టింట్లోకి వెళ్లి మరీ నాశనం చేశామంటూ మాట్లాడారు. భారత్‌ను, ప్రజలను రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకొంటామన్నారు. ఐతే, ఈ పర్యటన కూడా బెడిసికొట్టినట్టే కనిపిస్తోంది. జవాన్లతో మోడీ చేసిన వ్యాఖ్యలపై కూడా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘పహల్గాం మహిళల సిందూరాన్ని దూరం చేసిన ఉగ్రవాదులను, వారిని ఎగదోసిన పాక్‌ను విడిచిపెట్టడమేనా విూరు చెప్తున్న ఆ పెద్ద నిర్ణయం’ అంటూ నెటిజన్లు మోడీ వీడియోను ట్యాగ్ చేస్తూ ఎద్దేవా చేస్తున్నారు. యుద్దానికి ముందు లేదా యుద్ధం జరుగుతున్నప్పుడు నాయకుడు అనే వాడు సైన్యంలో ధైర్యాన్ని నూరిపోయడం చూశాంగానీ, యుద్ధం పూర్తయ్యాక వెళ్లడమేంటని మోడీని ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
లైవ్ స్టీమ్రింగ్, యూట్యూబ్, ఎఫ్‌బీ, ఎక్స్ లైవ్ వీడియోల్లో మోడీ ప్రసంగాల కు వ్యూయర్‌షిప్ భారీగా తగ్గింది. మరోవైపు, ’కాల్పుల విరమణ’ నిర్ణయంపై నెటిజన్లు మోడీ సర్కారుపై విమర్శలు చేయడం .. ఇంతలో ’మాదే విజయమ’ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించటం జరిగిపోయాయి. పాక్ సైనికులు మిఠాయిలు పంచుకొంటూ సంబురాలు చేసుకొన్న వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో మోడీ ప్రభుత్వంపై విమర్శల తీవ్రత మరింత పెరిగింది. ఇంటా బయటా ముప్పేట దాడి పెరుగుతుండటం, ఇంతలోనే ’కాల్పుల విరమణ’ నిర్ణయాన్ని పక్కనబెట్టి సరిహద్దుల్లో పాక్ మళ్లీ డ్రోన్ల దాడులతో కవ్వింపులకు పాల్పడుతుండటంతో ఎన్డీయే ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. డ్యామేజీ కంట్రోల్ చేసుకోకుంటే పరిస్థితి చేజారే ప్రమాదమున్నదని గ్రహించిన ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు.
అయితే, అంతకు ముందే లైన్‌లోని వచ్చిన ట్రంప్.. వాణిజ్యం ఆపేస్తానని బెదిరించడంతోనే భారత్`పాక్ కాల్పుల విరమణకు ఒప్పుకొన్నాయని బాంబు పేల్చారు. దీంతో మోడీ సర్కారు తీవ్ర ఇరకాటంలో పడింది. మొత్తంగా ’కాల్పుల విరమణ’ ప్రకటన, దాని తదనంతర పరిణామాలపై ప్రధాని మోడీ ఆత్మరక్షణలో పడి ఇమేజ్ మేకోవర్ కోసం ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయని చెప్తున్నారు. రాబోవు రోజులలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.
.........................
About The Author
